హైదరాబాద్, నవంబరు 6, 2018 : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సదుపాయం కల్పించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు, హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్, జిల్లా కేంద్రాల నుంచి జిల్లా కలెక్టర్లు వచ్చే నెల 7న జరగనున్న పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఎన్నికలను పర్యవేక్షించనున్నారు. ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే సంబంధిత పోలింగ్ కేంద్రం నంబర్ ఆధారంగా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సదుపాయం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై తక్షణమే నివేదిక సమర్పించాలని సీఈవో రజత్ కుమార్ సోమవారం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. 2009 సాధారణ ఎన్నికల నుంచి వెబ్ కాస్టింగ్ ప్రారంభం కాగా, అప్పటి నుంచి జరిగిన అన్ని సాధారణ, ఉప ఎన్నికల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని ఎన్నికల సంఘం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాలతో పోలింగ్ ప్రక్రియను రికార్డు చేయడం ప్రారంభించిన నాటి నుంచి దొంగ ఓట్లు, రిగ్గింగ్‌పై ఫిర్యాదులు తగ్గాయని, ఎక్కడా దౌర్జన్యానికి దిగి పోలింగ్‌కు అంతరాయం కలిగిన సంఘటనలు చోటు చేసుకోలేదని పేర్కొన్నారు. 2009తో పాటు 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా వెబ్ కాస్టింగ్‌ను సున్నిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలకు మాత్రమే పరిమితం చేశారు. ఇకపై అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరపనున్నారు.
ఇంజనీరింగ్ విద్యార్థుల సాయం..
2014 ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో 29,138 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, అందులోని 16,512 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించారు. ఇంటర్‌నెట్ సదుపాయం లేక వెబ్ కాస్టింగ్ సాధ్యం కాకపోవడంతో మరో 7,986 పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులను నియమించారు. 4,142 కేంద్రాల్లో వీడియోగ్రఫీ, 320 కేంద్రాల్లో డిజిటల్ కెమెరాలతో పోలింగ్ ప్రక్రియలను రికార్డు చేశారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల సంఖ్యను 32,574కు పెంచాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
ఈ కేంద్రాలన్నింటిలో వెబ్ కాస్టింగ్ జరపాలని భావిస్తోంది. బ్రాండ్ బ్యాండ్ ఇంటర్నెట్ సదుపాయం లేని చోట్ల బీఎస్‌ఎన్‌ఎల్ డేటా కార్డులు, వైర్‌లెస్ ఇంటర్నెట్ సదుపాయం ద్వారా వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం అధికారవర్గాలు తెలిపాయి. పోలింగ్ కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అవసరమైన సాంకేతిక సదుపాయాలను సమకూర్చుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులను ఎన్నికల సంఘం కోరినట్లు తెలిసింది. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సదుపాయం ఏర్పాటు, నిర్వహణ అవసరాల కోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో పాటు రాష్ట్రంలోని ఇతర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను ఎన్నికల సంఘం వినియోగించుకోనుంది.