‘ఆధునిక ప్రపంచానికి టెక్నాలజీ అద్భుత వరం..కానీ ఆనందానికి మాత్రం హానికరం!’అని అంటున్నారు పరిశోధకులు. దీనికి వారు చేపట్టిన అధ్యయనాన్నే రుజువుగా చూపుతున్నారు. విపరీతంగా స్మార్ట్‌ఫోన్ వాడకం మనుషుల్ని పక్కదారి పట్టిస్తుందని హెచ్చరిస్తున్నారు. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి రెండు అధ్యయనాలు చేపట్టారు. మొద ట 300 మంది వర్సిటీ విద్యార్థులను ఎంచు కుని రెస్టారెంట్‌కి తీసుకెళ్లారు.
స్నేహితులను బృందాలుగా చేసి ఒకే టేబుల్‌పై భోజనం వడ్డించి వారి ఫోన్లను చేతికిచ్చారు. భోజనం అనంతరం వారికి కలిగిన వివిధ అనుభవాలను రికార్డు చేసి విశ్లేషించారు. కాగా, స్మార్ట్‌ఫోన్ వాడకం వల్ల పరధ్యానంలో ఉండటం, ఆందోళన చెందటం వంటి ఆనందం తగ్గించే భావోద్వేగాలను కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. రెండో అధ్యయనంలో స్మార్ట్‌ఫోన్ వాడుతున్నప్పుడు తమ అనుభవాలను రాయాలని ఓ ప్రశ్నావళి ఇచ్చి సర్వే చేపట్టారు. తర్వాత వారి సమాధానాలను పరిశీలించగా..స్మార్ట్‌ఫోన్‌లో ఫేస్ టు ఫేస్ చాట్ వల్ల ఆనందం కలగకపోవడమే కాక, దానిపై విరక్తి పెరుగుతున్నట్లు గుర్తించారు.