వ్యాపార, వాణిజ్యరంగాలతో పాటు ఇతర రంగాల్లోనూ వినూత్న పంథాలో డ్రోన్ల సేవలను ఉపయోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం ’నూతన డ్రోన్లవిధానం’ రూపొందిస్తోంది..వివిధ వ్యాపారాల్లో వీటిని ఉపయోగించుకునేలా నూతన సాంకేతికను సిద్ధం చేసుకునేందుకు ఈ విధానం దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. విమానాశ్రయాలు, సైనిక వ్యవస్థలు, ప్రాముఖ్యత కలిగిన ఇతర ప్రాంతాల్లో భద్రతాపరమైన అంశాల పర్యవేక్షణ, క్రమబద్ధీకరణకే పరిమితం కాకుండా భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు పౌరవిమానయాన శాఖ అధికారులు వెల్లడించారు. భవిష్యత్‌లో డ్రోన్ టాక్సీలు వినియోగించే అవకాశంతో పాటు, విపత్కర పరిస్థితుల్లో అత్యవసరంగా రోగులకు రక్తాన్ని సరఫరా చేసేందుకు డ్రోన్లు ఉపయోగపడతాయని ఓ ఉన్నతస్థాయి అధికారి పేర్కొన్నారు.
చట్టబద్ధంగానే డ్రోన్లను నూతన పోకడలు, పద్ధతులకు ఏ విధంగా వినియోగించవచ్చో ఈ విధానం ద్వారా మదుపరులకు తెలియజేస్తామన్నారు. అవసరాన్ని బట్టి నిబంధనలు సడలించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ఆ అధికారి చెప్పారు. గత నవంబర్‌లో విడుదల చేసిన ముసాయిదా విధానంలో ఎయిర్‌పోర్టులు, దేశ సరిహద్దులను డ్రోన్ రహిత ప్రాంతాలుగా ప్రకటించారు. అయితే వాణిజ్యఅవసరాలకు సంబంధించి డ్రోన్లను వినియోగించినపుడు ఈ నిబంధనల్లో మినహాయింపులు పొందవచ్చు. అయితే నియమ, నిబంధనల నుంచి ప్రభుత్వ సంస్థలకు పూర్తిగా మినహాయింపు ఉంటుంది. ఈ సంస్థలు ఏ అవసరం కోసమైనా డ్రోన్లను ఉపయోగించవచ్చు. రాబోయే రోజుల్లో డ్రోన్లకు విడిగా మార్గాలు నిర్దేశించడంతో పాటు వీటి కోసమే ప్రత్యేకంగా ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోలర్‌ను నియమించే అవకాశాలున్నాయి. ’ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా డ్రోన్ల వినియోగానికి సంబంధించి అమల్లో ఉన్న నియమ, నిబంధనలు పరిశీలించాం.
వీటితో ముడిపడిన లోతైన అంశాలు, భద్రతాపరమైన విషయాలపై వివిధ ఏజెన్సీలతో సంప్రదింపుల ప్రక్రియ పూర్తిచేశాం. ఈ నేపథ్యంలో త్వరలోనే డ్రోన్ విధానాన్ని ప్రకటిస్తాం. ముసాయిదా విధానంలోని పలు అంశాలు మారుస్తున్నాం. ఈ విధానాన్ని ప్రకటించడం ద్వారా డ్రోన్ పరిశ్రమలో పెట్టుబడులు పెరిగేందుకు ఇది ’రోడ్డుమ్యాప్’ల ఉపయోగపడుతుంది’ కేంద్ర విమానయానశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా వెల్లడించారు. ’దాడుల కోసం డ్రోన్లను సులభంగా ఉపయోగించే అవకాశమున్నందున, భద్రతాపరమైన అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ విషయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేలా నియమ,నిబంధనలుంటాయి. డ్రోన్‌రహిత ప్రాంతాలతో పాటు ఇతర డేంజర్ జోన్లలో ప్రవేశించిన డ్రోన్లను కూల్చివేసే సాంకేతికను కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిశీలిస్తోంది’అని చెప్పారు.