By Ramesh Adusumilli, USA
కాలం ఎంత వేగంగా మారుతుంది! ముఖ్యంగా సాంకేతిక రంగం (టెక్నాలజీ) ఊపిరి తీసుకునేంత వేగంగా మారిపోతుంది. నా చిన్నప్పుడు ఫోన్ అనేది ఉండటమే కాదు, అటువంటిది ఒకటి రాబోతుందని కూడా తెలియదు. అంతెందుకండి, ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం సెలవుల్లో (1985 లో ) మద్రాస్ లో అదేదో మార్కెట్లోకి వెళ్లే వరకు కాలిక్యులేటర్ కూడా తెలియదు. ఇప్పుడు నా పిల్లలకు ఆ విషయం చెప్తే ఆశ్చర్యంగా చూస్తారు, మరి మాత్ ఎలా చేసేవారు అని నోరెళ్లబెడతారు. ఆరవ తరగతి నుంచే స్కూళ్లకు ట్యాబ్లెట్లు తీసుకెళ్లే వారు ఆ మాత్రం ఆశ్చర్యం పోవటంలో ఆశ్చర్యం లేదు మరీ!
ఇక ప్రభుత్వాలు సంగతి సరేసరి. 80-90 ల వరకు చాలా ప్రభుత్వాలకు కంప్యూటర్లే తెలియవు. ఎక్కడో ఒకటో అరా ఉండేవేమో! ఈ టెక్నాలజీ విప్లవానికి కారణం ఇంటర్నెట్, వరల్డ్ వైడ్ వెబ్ (WWW). 1960 వ దశకం మొదట్లో మాసాచూట్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (MIT) కి చెందిన “లికలైడర్” అనే ప్రొఫెసర్ కి మొదటిసారిగా కంప్యూటర్స్ ని ఒక దానికి మరొకటి కలపగలిగితే ఎలా ఉంటుంది అని వచ్చిన ఆలోచనే ఈ విప్లవానికి పునాది. ఆ ఆలోచన మీద పని చేసిన షుమారు మూడేళ్లు పని చేసిన కంప్యూటర్ శాస్త్రవేత్తలు “ప్యాకెట్ స్విచింగ్ (packet switching)” అనే సిద్ధాంతం కనిపెట్టారు. అంటే, ఒక కంప్యూటర్ నుంచి మరో కంప్యూటర్ కి ఎలక్ట్రానిక్ మెస్సేజెస్ పంపించగలగటం అన్న మాట. ఈ కాన్సెప్ట్ నచ్చి యూ ఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ దాని మీద మరింత రీసెర్చ్ చెయ్యటానికి ఆర్ధిక సహాయం చెయ్యటానికి ముందుకు వచ్చింది. దాని వల్ల పరిశోధనలు మరింత ముందుకు కదలి 1960 దశకం చివర్లో (షుమారు పదేళ్లకు) మొదటి ఇంటర్నెట్ నమూనా వచ్చింది. దాని పేరే ఆర్పనేట్ (ARPANET – Advanced Research Projects Agency Network). దాని ద్వారా ఒక సింగిల్ నెట్వర్క్ లో బహుళ కంప్యూటర్లు పెట్టి ఒక దాని నుంచి మరొక దానికి ప్యాకెట్ స్విచింగ్ ద్వారా మెసేజెస్ ప్రసారం చెయ్యగలిగేవారు. అది విజయవంతంగా మొదటిసారి నడిచింది 1973 లో. కానీ, ఈ ప్రపంచానికి ఒక సింగిల్ నెట్వర్క్ సరిపోతుందా? ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్వర్క్ మధ్య కమ్యూనికేషన్ ఎలా?
ఆ సమయంలో “రాబర్ట్ కాహ్న్” (picture#1) అనే ఎలక్ట్రికల్ ఇంజనీర్ రెండు నెట్వర్క్ ల మధ్య కమ్యూనికేషన్ కోసం TCP అనే ప్రోటోకాల్ కనిపెట్టాడు. రోజు ఇంటర్నెట్ వాడందే పూట గడవని వారు ఆయన ఫోటో పెట్టుకొని పూజ చెయ్యాలి. దానిమీద మరింత పరిశోదనలు జరిగాక ఆ TCP ని రెండు లేయర్స్ గా 1977 లో TCP/IP పేరుతో ప్రపంచానికి పరిచయం చేశారు.
1983 లో ఆర్పనేట్ కూడా TCP/IP ని వాడటం మొదలు పెట్టారు. అక్కడ నుంచి ఒక నెట్వర్క్ తర్వాత మరో నెట్వర్క్ బిల్డ్ చేసుకొంటూ వచ్చారు, అదే నేడు ఇంటర్నెట్ అయింది. ఆ టెక్నాలజీని వాడి 1990 లో “టిమ్ లీ” (picture#2) అనే శాస్త్రవేత్త వరల్డ్ వైడ్ వెబ్ (WWW) కనిపెట్టాడు.
ఇక మన దేశానికి వచ్చేసరికి, ఎలక్ట్రానిక్స్ రంగంలో మార్పులు, కంప్యూటర్లు వంటివి ప్రపంచంలో వస్తున్నాయని గ్రహించి వాటిని మన దేశంలో అమలు చెయ్యటానికి “డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్” ని 1970 లో స్థాపించారు. దాని తర్వాత 1977 లో నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) ని స్థాపించటంతో ఈ-గవర్నెన్స్, పరిపాలనలో టెక్నాలజీ వాడటం అనే అంశాలు మొదటిసారిగా ఒక చర్చకు దారి తీశాయి. మొట్టమొదటి నెట్వర్క్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ నెట్వర్క్ (ERNET) 1986 లో పెట్టారు. అది ఒక నెట్వర్క్ మాత్రమే. కానీ, దానికి ఒక రూపు, ఊపుని ఇచ్చింది 1987 లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం. నేషనల్ సెటిలైట్ బేస్డ్ నెట్వర్క్ (NICNET) అని ప్రపంచంలోనే పెద్దదైన కంప్యూటర్ బేస్డ్ నెట్వర్క్ ప్రారంభించి నేటి టెక్నాలజీకి పునాది వేశారు. ఆ టెక్నాలజీని వాడి దేశంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఈ-గవర్నెన్స్ జరగాలని రాష్ట్ర ప్రభుత్వాలని ఆదేశించటమే కాకుండా, అందుకు కావలసిన హార్డ్వేర్, సాఫ్ట్వేర్ సప్లై చేసి, అక్కడ కొంతమంది ఉద్యోగస్థుల్ని తీసుకొని వారికి స్కిల్ డెవలప్మెంట్ కింద ట్రైనింగ్ ఇచ్చింది అప్పటి కేంద్ర ప్రభుత్వం.
ఇంటర్నెట్ మన దేశంలో విదేష్ సంచార నిగమ్ లిమిటెడ్ (VSNL) ఆగస్టు 14 1995 లో ప్రవేశ పెట్టింది. ఇంటర్నెట్ రావటంతో కనెక్టివిటీ వేగం పుంజుకొంది. 1999 లో వై ఫై రావటంతో ఈ రంగం ఊహించనంత వేగంగా మారిపోతూ ఉంది.
ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఎంతో పరిశోధన, ఎంతో సమయం, ఎంతో డబ్బు – ఇవన్నీ కలిస్తే నేటి మన టెక్నాలజీ. వారందరికీ ధన్యవాదాలు.
Leave a Reply