చైనా ఇంటర్నెట్ దిగ్గజం ‘బైదు’ మరో నూతన ప్రాజెక్ట్‌ను చేపట్టింది. డ్రైవర్ రహిత, ఎలక్ట్రిక్ బస్సులను రూపొందించేందుకు చైనాలో బస్సుల తయారీకి పేరు గాంచిన ‘కింగ్‌లాంగ్’ కంపెనీతో జట్టు కట్టింది. ‘అపోలాంగ్’ పేరుతో కింగ్‌లాంగ్ తయారు చేయనున్న ఈ డ్రైవర్ రహిత ఎలాక్ట్రానిక్ బస్సుల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనున్నట్లు బైదు తెలిపింది. మనం నిత్యం చూసే సాధారణ బస్సులకు భిన్నంగా ఈ డ్రైవర్ రహిత బస్సులు ఉండనున్నట్లు సమాచారం. ఈ డ్రైవర్ రహిత బస్సుల్లో స్టీరింగ్ వీల్, పెడల్స్, డ్రైవర్ ఉండరు. ఇవేవి లేకుండా కేవలం అపోలో 3.0 అటానమస్ డ్రైవింగ్ ఒపెన్ ప్లాట్‌ఫామ్ టెక్నాలజీ సాయంతో ఈ బస్సులు రోడ్లపై తిరగనున్నాయి.
తొలుత ఈ బస్సులు విమానాశ్రాయాలు, సందర్శనీయ ప్రాంతాల్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. వాణిజ్యపరంగా పూర్తి తొలి అటానమస్ / డ్రైవర్ రహిత బస్సులుగా అపోలాంగ్ బస్సులు గుర్తింపు పొందనున్నాయి. తొలుత వీటిని బీజింగ్, షెన్జెన్, జియోగన్, వూహన్, పింగనస్ నగర రవాణా సంస్థల్లో వినియోగించనున‍్నట్లు సమాచారం. ఈ బస్సుల గురించి బైదు చైర్మన్, సీఈవో రాబిన్ లి బైదు బీజింగ్‌లో ఏర్పాటు చేసిన ‘క్రియేట్ 2018’ కన్సల్టింగ్ సందర్భంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా రాబిన్ లి బైదు మాట్లాడుతూ.. ‘డ్రైవర్ రహిత ప్రయాణ వ్యాపారీకరణకు తొలి అడుగు 2018లోనే పడింది. పెద్ద మొత్తంలో తయారయ్యే అపోలాంగ్ బస్సుల వల్ల చైనా గొప్ప ప్రగతి సాధిస్తుంద’ని తెలిపారు. అంతేకాక తాము అందించే సాంకేతిక పరిజ్ఞానం కేవలం బస్సులకే పరిమితం కాదని తెలిపారు. ప్రస్తుతం బైదు అందించే ఒపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్ టెక్నాలజీ కోసం ఇప్పటికే దాదాపు 116 కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. వీటిలో ‘జాగ్వర్ లాండ్ రోవర్’, ‘బీవైడీ’ ప్రధానమైనవి. ‘బీవైడీ’ చైనాలోనే ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ. త్వరలోనే బీవైడీ ‘ఎల్ 3’ అటానమస్ వాహనాల తయారీని ప్రారంభించనుంది.
ప్రస్తుతం బైదు తయారీ చేయనున్న అటానమస్ బస్సులు కేవలం చైనా రోడ్లకు మాత్రమే కాక వేరే దేశాలకు కూడా విస్తరింపజేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలో బైదు దృష్టి సారిస్తున్న మొట్టమొదటి దేశం జపాన్. ఇప్పటికే జపాన్‌లో అటానమస్ వాహనాల తయారు చేస్తున్న, జపాన్ సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ అనుబంధ సంస్థ ‘ఎస్‌బీ డ్రైవ్’తో బైదు సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో 2019 నాటికి అపోలాంగ్ అటానమస్ మిని బస్పులను జపాన్ రోడ్ల మీదకు తీసుకు వచ్చేందుకు కింగ్‌లాంగ్, బైదు కంపెనీలు కృషి చేస్తున్నాయి.
నాటికి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 12.5 కోట్ల ఎలక్ట్రిక్ కార్లు రోడ్ల మీదకు రానున్నట్టు ఇటీవల ఓ సర్వే తెలిపింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో చైనా ముందు స్థానంలో ఉంది. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనాల్లో సగం చైనాలోనే అమ్ముడయ్యాయి. తరువాత స్థానంలో అమెరికా ఉంది. అతి త్వరలోనే ఎలక్ట్రిక్, అటానమస్ వాహనాలు వల్ల ప్రపంచ నగరాల్లో విప్లవాత్మకమైన మార్పులు రానున్నట్లు సమాచారం.
వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్, బోస్టన్ కన్పులేటింగ్ నిర్వహించిన సర్వే ప్రకారం 60 శాతం ప్రజలు అటానమస్ వాహనాల వినియోగం పట్ల సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. అంతేకాక రైడ్ షేరింగ్ సర్వీస్ కూడా చాలా వేగంగా పెరగనున్నట్లు ఈ సర్వే తెలిపింది.
Leave a Reply