టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో దివాళి సందర్భంగా కస్టమర్లకు 100 పర్సెంట్ క్యాష్‌బ్యాక్, గిఫ్ట్ కార్డ్ లాంటి ఎన్నో ఆఫర్లను ప్రకటించింది. పండుగ సందర్భంగా రూ. 100 కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న అన్ని రిచార్జ్ ప్లాన్లపై 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఇస్తోంది. ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ని రిలయన్స్ డిజిటల్ కూపన్ల రూపంలో అందిస్తోంది. వీటిని ఆన్లైన్, ఆఫ్‌లైన్ రిచార్జ్‌ల కోసం వాడుకోవచ్చని తెలిపింది. అంతేకాక పేటీఎమ్ వ్యాలెట్, ఫోన్‌పే, అమెజాన్ పే, మోబిక్విక్ యాప్‌ల ద్వారా పేమెంట్స్ చేసే వారికి రూ. 300 వరకూ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ని ప్రకటించింది.
దివాళి ధమాకాలో భాగంగా పండుగ సందర్భంగా స్పెషల్ యాన్యువల్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.1,699తో రీఛార్జ్ చేయించుకుంటే వచ్చే ఏడాది దివాళి వరకు కస్టమర్లు ఉచితంగా అన్ని రకాల ప్రయోజనాలు పొందవచ్చని ప్రకటించింది. ఈ ప్లాన్ కింద ఉచితంగా లోకల్, నేషనల్ కాల్స్, అపరిమిత రోమింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, 547.5 జీబీ డేటాను పొందవచ్చు. వచ్చే ఏడాది దివాళి వరకు ఈ ప్రయోజనాలను కస్టమర్లకు జియో ఆఫర్ చేస్తోంది. ఈ యాన్యువల్ ప్లాన్‌పై కూడా 100 శాతం క్యాష్‌బ్యాక్‌ని ఇస్తోంది.
పండుగ సందర్భంగా ‘జియో ఫోన్ 2 ఫెస్టీవ్ సేల్ 2’ని ప్రకటించింది. రూ. 2,999 ఖరీదైన ఈ జియో ఫోన్ 2.. నవంబర్ 5(నేటి నుంచి) నుంచి 12 వరకూ కంపెనీ సైట్లో అందుబాటులో ఉంటుంది. జియో ఫోన్ 2ను కొనేవారు పేటీఎం వ్యాలెట్ ద్వారా పేమెంట్ చేస్తే రూ. 200 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో రూ.2,799కే లభిస్తుంది. వీటితో పాటు జియో ఫోన్, జియో ఫోన్2 కోసం మూడు రకాల ప్రిపేయిడ్ రిచార్జ్ ప్లాన్స్‌ని అందుబాటులోకి తేచ్చింది. రూ. 49తో రిచార్జ్ చేస్తే 1 జీబీ డాటా, ఫ్రీ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 50 ఎస్ఎంఎస్లను 28 రోజుల పాటు పొందవచ్చు. రూ. 99తో రిచార్జ్ చేస్తే రోజుకు 500 ఎంబీ 4జీ డాటా, ఫ్రీ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 300 ఎస్ఎంఎస్లను 28 రోజుల పాటు పొందవచ్చు. రూ. 153తో రిచార్జ్ చేస్తే రోజుకు 1. 5జీబీ డాటా, ఫ్రీ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను 28 రోజుల పాటు పొందవచ్చు.
కొత్త 4జీ స్మార్ఫోన్ల కొనుగోలుపై కూడా జియో రూ.2, 200 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఈ క్యాష్‌బ్యాక్‌ను రూ. 50 విలువైన 44 కూపన్ల ద్వారా మైజియో యాప్ ద్వారా అందించనుంది. ఈ కూపన్లను అదే 4జీ స్మార్ట్‌ఫోన్ రిచార్జ్ కోసం వాడాలని తెలిపింది. వీటితో పాటు రిలయన్స్ రిటైల్ స్టోర్ల నుంచి రూ.35,000 విలువైన ల్యాప్‌టాప్‌ని కొంటే రూ. 3,000 విలువైన జియోఫై, డాటా లాభాలతో పాటు జియో ప్రైమ్ మెంబర్షిప్, 168 రోజుల పాటు రోజుకు 2జీబీ డాటాతో పాటు.. 6జీబీ డాటాను కల్గిన 10 వోచర్లను ఉచితంగా పొందవచ్చు. రూ. 30,000 ఖరీదైన ల్యాప్‌టాప్ కొనేవారికి కూడా ఈ ఆఫర్ వర్తించాలంటే.. అదనంగా రూ. 999 చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించింది.