టెక్నాలజీ ఆధారిత సమాజాన్ని నిర్మించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్.
హైదరాబాద్ : పారిశ్రామిక విప్లవంలో డిజిటల్ విప్లవం కూడా కీలకమని మంత్రి కేటీఆర్ చెప్పారు. సమాజానికి ఉపయోగపడని టెక్నాలజీ వ్యర్థమన్న కేటీఆర్.. తెలంగాణ ప్రభుత్వం 2016లోనే ఐటీ పాలసీని ప్రారంభించిందని గుర్తు చేశారు. ఈ పాలసీ ప్రకారం 10 రంగాలపై దృష్టి పెట్టామని తెలిపారు. ఐటీ ఆధారిత సేవలను రోజు రోజుకూ బలపరుస్తూనే ఉన్నామన్నారు. కొత్త కొత్త టెక్నాలజీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనాలసిస్ ఇలా ఎన్నో సాంకేతిక విప్లవాలు వస్తున్నాయని కేటీఆర్ వివరించారు.
నీతి ఆయోగ్ సహకారంతో హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో న్యూక్లియస్ విజన్ సంస్థ అంతర్జాతీయ బ్లాక్ చైన్ కాంగ్రెస్ నిర్వహిస్తోంది. రెండు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో తొలిరోజు మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసం చేశారు.
రాష్ట్ర అభివృద్ధిపథంలో బ్లాక్‌చైన్ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుందని కేటీఆర్ చెప్పారు. మానవాభివృద్ధిలో ఇదో కొత్త అధ్యాయం అని పేర్కొన్నారు. వివిధ శాఖలను ఈ కొత్త టెక్నాలజీ సమన్వయం చేస్తుందన్నారు. దీని వల్ల నిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడుతుందన్నారు. బ్లాక్‌చైన్ టెక్నాలజీ ద్వారా జరిగిన లావాదేవీలు అత్యంత పకడ్బందీగా ఉంటాయని కేటీఆర్ వెల్లడించారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో విశ్వసనీయత, కచ్చితత్వం పెరుగుతుందన్నారు. ఈ టెక్నాలజీతో మోసాలను అరికట్టవచ్చని తెలిపారు. లావాదేవీలపై బ్లాక్‌చైన్ టెక్నాలజీ పూర్తి నియంత్రణ కలిగి ఉంటుందన్నారు.
ప్రజలకు చెందిన భూరికార్డులు, ఓటింగ్ రికార్డులు, ఆరోగ్యపరమైన రికార్డులు అన్నీ.. బ్లాక్‌చైన్ టెక్నాలజీ ద్వారా సురక్షితంగా ఉంటాయని మంత్రి కేటీఆర్ వివరించారు. భూ రికార్డుల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యంత క్లిష్టమైన సమస్య అని, బ్లాక్‌చైన్ టెక్నాలజీతో ఆ రికార్డుల మెయింటెనెన్స్ సులువుగా ఉంటుందని చెప్పారు. భూ పత్రాలు, భూమిని ఎవరికి అమ్మారు, ఎవరు కొన్నారన్న అంశాలు ఈ టెక్నాలజీతో భద్రంగా ఉంటాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన 93 శాతం సక్సెస్ అయ్యిందని మంత్రి వివరించారు. పౌరులు వివిధ దశల్లో వాడే కీలకమైన డాక్యుమెంట్లను ఈ టెక్నాలజీతో భద్రపరుచుకోవచ్చు అని చెప్పారు. భూ రికార్డుల ప్రక్షాళనను ఇప్పడు పట్టణ ప్రాంతాల్లోనూ చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.
మును ముందు బ్లాక్‌చైన్ టెక్నాలజీ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ అత్యాధునికమైందని, సమగ్రమైందని, పారదర్శకమైందన్నారు. తెలంగాణ ప్రభుత్వం బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారంగా కొన్ని పైలట్ ప్రాజెక్టులను చేపడుతుందని కేటీఆర్ ప్రకటించారు. 10వ తరగతి సర్టిఫికెట్లను భద్రపరిచేందుకు ఈ టెక్నాలజీని వాడుతున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల టెన్త్ డేటాను బ్లాక్‌చైన్ టెక్నాలజీ ద్వారా స్టోర్ చేస్తారని, విద్యార్థుల డేటాను ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చని మంత్రి వెల్లడించారు
Leave a Reply