హైదరాబాద్ : విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ ను సురక్షిత నగరంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఆపదల సమయంలో హైదరాబాద్ మహానగరాన్ని రక్షించేందుకు మంత్రి కేటీఆర్ సూచనల మేరకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను జీహెచ్‌ఎంసీ సిద్ధం చేసింది. ఇలా విపత్తుల నిర్వహణ విభాగాన్ని బలోపేతం చేసిన మొదటి నగరపాలక సంస్థగా జీహెచ్‌ఎంసీ రికార్డు సృష్టించింది. ఐపీఎస్ అధికారి విశ్వజిత్ కంపాటి ఆధ్వర్యంలో ఈ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. వేర్వేరు విభాగాల్లో 120 మందికి రెండు నెలలపాటు ప్రత్యేక శిక్షణనిచ్చారు. వరదలు, చెట్లు విరిగిపడటం, అగ్నిప్రమాదాలు, నిర్మాణాలు కూలడం వంటి దుర్ఘటనలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలో నేర్పించారు. ప్రకృతి విపత్తులు, నాలాల కబ్జాలు, ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.
డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కు కావలసిన అన్ని సౌకర్యాలను రాష్ట్రప్రభుత్వం కల్పించింది. అన్ని రకాల ప్రమాదాల్లో బాధితులను రక్షించేందుకు, ప్రమాదాన్ని నివారించేందుకు అవసరమైన పరికరాలను ప్రత్యేకంగా ఎంపిక చేసి కొనుగోలు చేశారు. ఇందుకు విదేశాల్లో ఉపయోగించే రకరకాల పరికరాలను పరిశీలించారు. ఎనిమిది జనరేటర్లు, 1 హెచ్‌పీ మోటార్లు నాలుగు, టార్చిలైట్లు 24, వైద్య పరికరాల కిట్లు, పెద్ద తాళ్లు, టెలిస్కోపిక్ లాడర్స్, ఎల్‌ఈడీ దీపాలుండే హెల్మెట్లు, అగ్నిని నిరోధించే పరికరాలు, ఇనుమును కత్తిరించే పరికరాలను సమకూర్చారు. వాటిని, సిబ్బందిని సంఘటన స్థలానికి క్షణాల్లో చేర్చేందుకు 8 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ హెచ్‌ఎండీఏ పార్కింగ్ ప్లెస్ లో జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ను ప్రారంభించారు. మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి, సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ఎస్ రెడ్డి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీలో కొత్తగా ఏర్పాటు చేసిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తుందన్నారు మంత్రి కేటీఆర్. దేశంలో ఇలాంటి ప్రత్యేక ఫోర్స్ ఉన్న నగర పాలక సంస్థ జీహెచ్ఎంసీ మాత్రమేనని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో ఎలాంటి విపత్తులు వచ్చినా డిజాస్టర్ టీం ముందుంటుందని సూచించారు. హైదరాబాద్ పోలీసులు సమర్థవంతంగా పనిచేయడం వల్ల నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. తెలంగాణ పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని కేంద్రం కూడా ప్రశంసించిందని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్.
అంతకుముందు డిజాస్టర్ టీం విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వాహనాల ప్రదర్శనతో పాటు విపత్తు నిర్వహణ దళం సభ్యుల సాహసకృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి
Leave a Reply Cancel reply