టెక్నాలజీ ప్రియులకు గూగుల్ తీపి కబురు తెచ్చింది. తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్)లో కొత్త వెర్షన్ ‘పై’ను మంగళవారం ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్ ఓఎస్ సిరీస్‌లో ఇది తొమ్మిదవది. ప్రస్తుతం ‘ఓరియో’ ఓఎస్‌ను ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌లలో వినియోగిస్తున్నారు. సమాచార గోప్యత(ప్రైవసీ)కు సంబంధించి మరిన్ని మెరుగైన ఫీచర్లతో పాటు పలు అధునాతన అంశాలను కొత్త ఓఎస్‌లో జతచేసినట్లు గూగుల్ పేర్కొంది.
ముఖ్యంగా ‘పై’ ఓఎస్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సామర్థ్యం అత్యంత ముఖ్యమైనదిగా చెబుతోంది. ఇటీవలి కాలంలో మొబైల్స్ ఇతరత్రా స్మార్ట్ పరికరాల్లో సమాచార గోప్యత లోపాలపై భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గూగుల్ నూతన ఓఎస్‌లో ప్రైవసీకి పెద్దపీట వేయడం గమనార్హం. కాగా, గూగుల్ పిగ్జెల్ మొబైల్ యూజర్లకు త్వరలోనే ‘పై’ ఓఎస్ ఆన్‌లైన్ అప్‌డేట్ అందుబాటులోకి రానుంది.
సోనీ మొబైల్, షావొమీ, హెచ్‌ఎండీ గ్లోబల్, ఒపో, విపో, వన్ ప్లస్ తదితర మొబైల్ తయారీ కంపెనీలతో పాటు ఆండ్రాయిడ్ వన్ యూజర్లకు ఈ ఏడాది చివరికల్లా ‘పై’ అప్‌డేట్ లభ్యమవుతుందని గూగుల్ తన బ్లాగ్‌లో వెల్లడించింది. ఆండ్రాయిడ్ 9 ‘పై’తో కొత్త మొబైల్స్‌ను విడుదల చేసే విధంగా తయారీ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది.
మీకేం కావాలో చెప్పేస్తుంది…
ఆండ్రాయిడ్ ‘పై’.. మొబైల్ వాడకాన్ని మరింత స్మార్ట్‌గా మార్చేస్తుందని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ (ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, ఆండ్రాయిడ్, గూగుల్ ప్లే) సమీర్ సామత్ పేర్కొన్నారు. మొబైల్ యూజర్ వివిధ అప్లికేషన్లను వాడే విధానాన్ని ఆండ్రాయిడ్ ‘పై’లోని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు గుర్తించి.. తదనుగుణంగా సూచనలు, సలహాలను అందిస్తుందని చెప్పారు.
అంటే… అప్పుడున్న పరిస్థితుల్లో మీకేం కావాలో మీ మొబైల్ మీకు ఊహించి చెప్పేస్తుందన్న మాట!! అదే విధంగా ఇందులోని అడాప్టివ్ బ్యాటరీ ఫీచర్ కూడా మీరు ఎక్కువగా వాడే యాప్స్‌ను గుర్తుంచుకొని.. వాటికి మాత్రమే బ్యాటరీ పవర్‌లో ప్రాధాన్యం ఇస్తుంది. ఇంకా అడాప్టివ్ బ్రైట్‌నెస్ పీచర్.. వివిధ సెట్టింగ్స్‌కు మీరు ఎంత స్క్రీన్ వెలుగు(బ్రైట్‌నెస్)ను కోరుకుంటారో గుర్తించి… ఆటోమేటిక్‌గా ఆ మేరకు సర్దుబాటు చేస్తుంది. అంతేకాదు కొత్త డ్యాష్‌బోర్డును కూడా గూగుల్ చేర్చింది. మీరు మీ డివైజ్‌పై దేనికి ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారో ఇది ఇట్టే చెప్పేస్తుంది.
Leave a Reply Cancel reply