పొద్దున లేచింది మొదలు, రాత్రి నిద్రపోయేంతవరకు సోషల్ మీడియాకు అంతా దాసోహమవుతున్న సందర్భంలో ఉన్నాం. చిన్నా పెద్దా తేడా లేకుండా, ఫేస్బుక్, వాట్సాప్, ట్విటర్ లాంటి ప్లాట్ ఫాంలకు అతుక్కు పోతున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. అదే సందర్భంలో ఈ సోషల్ మీడియా మ్యానియా నుంచి కాస్తయినా బయటపడాలని భావిస్తున్న వారు లేకపోలేదు. అలాటి వారికోసం ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఒక చక్కటి అవకాశాన్ని అందిస్తోంది. అదే ‘యువర్ టైం’ అనే ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా రోజుకు ఎంత సమయం ఫేస్బుక్లో, ఇన్‌స్టాగ్రామ్‌లో గడుపుతున్నారో తెలుసుకోవచ్చు. అంతేకాదు అచ్చం అలారం లాగే మనల్ని మనం నియంత్రించుకోవచ్చని ఫేస్బుక్ వెల్లడించింది.
న్యూస్‌ఫీడ్ చెక్ చేయడం ప్రారంభించాక సమయం తెలీకుండా అయిపోతోందా ?ఈ సమయాన్ని తగ్గించాలని మీరు భావిస్తున్నారా ? అయితే ఫేస్బుక్లో కొత్తగా వచ్చిన ఫీచర్ అలాంటి వారికి చక్కగా ఉపయోగపడుతుంది.
రోజుకు ఎంత సమయాన్ని ఫేసుబుక్‌లో గడుపుతున్నారో సూచించే కొత్త అప్డేట్ను ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తీసుకువచ్చింది. ఇందులో రోజూవారీగా మీరు గడిపిన సమయాన్ని ఇందులో చూసుకోవచ్చు. నిర్ణీత సమయానికి అలర్ట్ పెట్టుకొని ఫేస్బుక్లో మీరు గడిపే సమయాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. నిర్ణీత పరిమితి తర్వాత నోటిఫికేషన్లను నిలిపివేసేలా సెట్టింగ్స్‌ను ఏర్పాటు చేశారు.
అయితే ఇది ఎంతవరకు ఉపయోగకరం అన్న వాదన కూడా తెరపైకి వస్తోంది. చిన్న నోటిఫికేషన్ వస్తే అది తెరిస్తే ఆ సమయాన్ని కూడా ఫేస్బుక్ గణిస్తుందనీ, ఈ క్రమంలో క్వాలిటీగా గడిపిన సమయాన్ని ఎలా గణిస్తారని టెక్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.