దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సర్వీసుల రంగం, స్టార్టప్‌లు వచ్చే ఏడాది భారీ స్థాయిలో నియామకాలు చేపట్టనున్నాయి. 2019లో దాదాపు 5 లక్షల మందిని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో, మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ చైర్మన్ టి.వి.మోహన్‌దాస్ పాయ్ తెలియజేశారు. ఫ్రెషర్లకు డిమాండ్ పెరుగుతోందని చెప్పారాయన. దాదాపు ఏడేళ్ల పాటు స్థిరంగా ఉండిపోయిన ఎంట్రీ స్థాయి ఉద్యోగుల జీతభత్యాల ప్యాకేజీలు గతేడాది సుమారు 20 శాతం మేర పెరిగాయని తెలిపారు. 2018 సమీక్ష, 2019 అంచనాల మీద మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు చెప్పారు. “2018లో హెచ్1బీ వీసాల నిబంధనలు కఠినతరమయ్యాయి. దీంతో భారత ఐటీ కంపెనీలు జపాన్, ఆగ్నేయాసియా దేశాలపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ ఐటీ సేవల రంగం మళ్లీ వృద్ధి బాట పడుతోంది. మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ మంత్రి కేటీఆర్ మార్కెటింగ్ నైపుణ్యాలతో మరిన్ని కొత్త కంపెనీలు హైదరాబాద్‌కి వస్తున్నాయి. హైదరాబాద్ హాట్ డెస్టినేషన్‌గా మారింది” అని పాయ్ పేర్కొన్నారు.
స్టార్టప్‌లలో 2 లక్షల ఉద్యోగాలు
దేశీ స్టార్టప్ సంస్థలు వచ్చే ఏడాది సుమారు 2,00,000 మంది ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉందని పాయ్ తెలిపారు. స్టార్టప్స్ గతేడాది 1,50,000 మందిని నియమించుకున్నాయని.. ప్రస్తుతం వీటిల్లో ఉద్యోగుల సంఖ్య 6,00,000 పైచిలుకు ఉంటుందని ఆయన తెలిపారు. ఐటీ సర్వీసులు, స్టార్టప్స్ కలిస్తే 4.5 లక్షలు – 5 లక్షల దాకా నియామకాలు ఉండొచ్చన్నారు. 2018లో ఇవి రెండూ కలిపి సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల మంది దాకా ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నట్లు వివరించారు. “స్టార్టప్‌లు కూడా పెద్ద కంపెనీలుగా ఎదుగుతున్నాయి. ప్రస్తుతం దేశీయంగా 39,000 పైచిలుకు స్టార్టప్స్ ఉన్నాయి. ప్రతీ సంవత్సరం కొత్తగా 5,000 ఏర్పడుతున్నాయి. ఇవి హైరింగ్ చేపట్టినప్పుడు ఇంజినీర్లే కాకుండా వివిధ రకాల ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటూ ఉంటాయి. ఆ రకంగా వీటిల్లోనూ ఉద్యోగావకాశాలు గణనీయంగా ఉన్నాయి” అని పాయ్ తెలిపారు.
ఎంట్రీ లెవల్లో రూ.5 లక్షలు?
ఐటీ సేవల సంస్థల్లో ఉద్యోగులు కొత్త నైపుణ్యాల్లో శిక్షణ పొందుతుండటం రెట్టింపు స్థాయిలో జరుగుతోందని, ఐటీ కంపెనీల్లో డిజిటల్ విభాగాల ఆదాయాలు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతోందని పాయ్ చెప్పారు. ‘‘ఫ్రెషర్స్ జీతభత్యాల ప్యాకేజీ చాలా కాలం తర్వాత 20 శాతం మేర పెరగడం మంచి పరిణామం. మరింత సుశిక్షితులైన నిపుణులను ఆకర్షించేందుకు కంపెనీలు మరింత ఎక్కువ జీతభత్యాలు ఆఫర్ చేస్తున్నాయి. దీంతో ఎంట్రీ లెవెల్ ప్యాకేజీలు ప్రస్తుతం వార్షికంగా రూ. 4.5 – 5 లక్షల దాకా ఉంటున్నాయి. నిజానికి చాలా కాలం పాటు ఎంట్రీ లెవెల్లో జీతాలు పెరగకుండా స్థిరంగా ఉండిపోయాయి. దీంతో ఉద్యోగులు నిరాశలో మునిగారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లతో పోలిస్తే పెద్ద నగరాల్లో డెలివరీ బాయ్స్ కూడా నెలకు రూ.50,000 సంపాదిస్తున్నారు. ఇది చాలా హాస్యాస్పదమైన విషయం” అని పాయ్ వ్యాఖ్యానించారు.
డిజిటైజేషన్‌తో వ్యాపార అవకాశాలు
వచ్చే ఏడాది డిజిటైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, అమెరికా బ్యాంకింగ్.. ఫైనాన్షియల్ సర్వీసెస్.. ఇన్సూరెన్స్ కంపెనీలు భారీగా ఐటీపై వెచ్చించనుండటం తదితర అంశాలు భారత ఐటీ కంపెనీలకు వృద్ధి అవకాశాలు కల్పించగలవని పాయ్ చెప్పారు. యూరప్, ఆసియా మార్కెట్లలోకి కూడా చొచ్చుకుపోయేందుకు అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అయితే, అమెరికాలో లోకలైజేషన్ ప్రధాన సవాలుగా ఉండవచ్చని చెప్పారు. ప్రస్తుతం అమెరికా విధానాలకు అనుగుణంగా స్థానికంగా నియామకాలు చేపట్టడం, కార్యకలాపాలు విస్తరించడం వంటి అంశాలపై దేశీ ఐటీ కంపెనీలు దృష్టి సారిస్తున్నాయన్నారు. అయితే, ఎక్కువగా చిన్న పట్టణాల్లో విస్తరిస్తుండటం వల్ల.. వాస్తవంగా ఖర్చులు పెరగడం కన్నా తగ్గగలవని పాయ్ పేర్కొన్నారు.