గూగుల్ యాప్ స్టోర్ నుంచి ఫోటో ఎడిటింగ్ లేదా బ్యూటీ యాప్స్ వినియోగిస్తున్న యూజర్లకు షాకింగ్ న్యూస్. గూగుల్ ప్లేస్టోర్‌లోని 29 ఫోటో ఎడిటింగ్ యాప్స్ యూజర్ల డేటాను చోరీ చేస్తున్నాయట. ఈ నేపథ్యంలోనే భద్రతా కారణాల రీత్యా గూగుల్ కొన్ని యాప్‌లను డిలీట్ చేసింది. గూగుల్ ప్లేస్టోర్‌లోని 29 ఫోటో ఎడిటింగ్ యాప్స్ ను తొలగించినట్టు తాజాగా వెల్లడించింది. వీటి ద్వారా యూజర్ల డేటాకు భారీ ప్రమాదం ఉందన్న నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఆసియాలో ముఖ్యంగా ఇండియాలో ప్రో కెమెరా బ్యూటీ, కార్టూన్ ఆర్ట్ ఫోటో, ఎమోజి కెమెరావంటి యాప్స్ కొన్ని లక్షలకు పైగా డౌన్లోడ్ అవుతున్నాయని, ఇది ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది. హానికరమైన ఈ యాప్స్ మాల్వేర్ను స్మార్ట్ఫోన్లలోకి పంపిస్తున్నాయంటూ అమెరికా ఆధారిత సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ ట్రెండ్ మైక్రో గుర్తించింది. ప్లేస్టోర్‌లోని బ్యూటీ కెమెరా యాప్స్ రిమోట్ యాడ్ కాన్ఫిగ్యురేషన్ సర్వర్లను యాక్సెస్ చేయగలదని ట్రెండ్ మైక్రో తన అధికారిక బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించింది.
ముఖ్యంగా ప్రో కెమెరా బ్యూటీ, ఎమొజీ కెమెరా, సెల్ఫీ కెమెరా ప్రో, ఫోటో ఎడిటర్, ఆర్ట్ ఎఫెక్ట్, వాల్‌పేపర్స్ హెచ్డీ, ప్రిజ్మా ఫోటో ఎఫెక్ట్ లాంటివి ఈ జాబితాలో ఉన్నాయి. వీటిద్వారా యూజర్ల చిరునామాలు, ఫోన్ నంబర్లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తోందని పేర్కొంది. ఈ యాప్స్ డౌన్లోడ్ చేయగానే యూజర్లకు ఎలాంటి సందేహం రాకుండా.. గుర్తించలేనంతగా ఒక షార్ట్‌కట్‌ను క్రియేట్ చేస్తుంది. దీని వలన ఈ యాప్‌ను అన్ఇన్స్టాల్ చేయడం కూడా కష్టతరం అవుతుందని వివరించింది. అంతేకాదు వీటిని ఎనలైజ్ చేయడానికి వీల్లేకుండా ప్యాకర్స్ను కూడా వాడుతుందట.